: అత్యాచారయత్నం చేస్తూ దొరికిపోయిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపిన ఢిల్లీ వాసులు
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని పాండవ నగర్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, 25 సంవత్సరాల గోలు అనే వ్యక్తి, తిను బండారాలు కొనిస్తానని చెప్పి చిన్నారిని తీసుకెళ్లాడు. బయటకు వెళ్లిన తమ బిడ్డ ఎంతకూ ఇంట్లోకి రాకపోవడంతో, వెతుకుతున్న ఆమె తల్లికి, గోలు బిడ్డను తీసుకెళ్లాడని కొందరు స్థానికులు చెప్పారు. ఆపై కొంతమందితో కలసి బిడ్డ కోసం వెతుకుతుంటే, సంజయ్ లేక్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గోలు కనిపించాడు.
ఆ వెంటనే బిడ్డపై అత్యాచారం చేసేందుకే గోలు ఇక్కడికి తీసుకొచ్చాడని ఆరోపిస్తూ, రాళ్లతో కొట్టి కర్రలతో దాడి చేశారు. వీరి దాడిలో గోలు అపస్మారక స్థితిలోకి వెళ్లగా, విషయం తెలుసుకున్న పోలీసులు స్పందించి, గోలును లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం జీటీబీ ఆసుపత్రికి తరలించగా, అతను మరణించాడు. గోలు మద్యానికి, మాదక ద్రవ్యాలకు బానిసని, కేసును నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని, దాడి చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు వెల్లడించారు.