: 'నన్ను ప్రగతి భవన్ ముందు సమాధి చేయండి... నా బిడ్డలను పవన్ కల్యాణ్ ఆదుకోవాలి' అంటూ సూసైడ్ నాట్ రాసి.. ఆత్మహత్యాయత్నం!
నిర్మల్ జిల్లా తిమ్మాపూర్ కు చెందిన దేవన్న అనే వ్యక్తి హైదరాబాదులోని తెలంగాణ సచివాలయంలోని సి.బ్లాక్ ఎదుట పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు కుమార్తెలతో సచివాలయానికి చేరుకున్న దేవన్న తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతనిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.
కాగా, అతని వద్ద ఒక లేఖ లభ్యమైంది. అందులో తనను మూడేళ్లుగా మంత్రి ఐకే రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జేసీ శివలింగయ్యలు వేధిస్తున్నారని ఆరోపించాడు. తమకు తాగునీరు, తిండి, ఉపాధి లేకుండా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారాజ్యం పార్టీ కోసం జీవితాన్ని నాశనం చేసుకున్నానని ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం చదువు వదిలేశానని, తండ్రితో పాటు కుమారుడ్ని కూడా పోగొట్టుకున్నానని ఆయన పేర్కొన్నారు.
చిరంజీవి, పవన్ కల్యాణ్ లను కలిసేందుకు చాలాసార్లు ప్రయత్నించినా సిబ్బంది అనుమతించలేదని చెప్పాడు. తన బిడ్డలను పవన్ కల్యాణ్ ఆదుకోవాలని ఆయన ఆ లేఖలో కోరారు. అలాగే తనను ప్రగతి భవన్ ముందు సమాధి చేయాలని ఆయన కోరారు.