: ట్రంప్ తో మాకు పెను ముప్పు ఉంది: విప్రో సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో భారత ఐటీ రంగానికి పెనుముప్పు పొంచి ఉందన్న అంచనాలు నిజమవుతున్నాయి. ఇంతవరకు ఏ ఒక్క ఐటీ సంస్థ కూడా ట్రంప్ నిర్ణయాలతో తాము ఏ మేరకు దెబ్బతినబోతున్నామన్న విషయాన్ని వెల్లడించలేదు. తొలిసారిగా, భారతీయ ఐటీ దిగ్గజం విప్రో ట్రంప్ ముప్పు గురించి బహిరంగంగా వెల్లడించింది. ట్రంప్ వల్ల తమకు చాలా నష్టం వాటిల్లబోతోందంటూ తెలిపింది.
ఇన్ని సంవత్సరాల్లో తొలిసారి ఓ అమెరికా అధ్యక్షుడి వల్ల తాను ముప్పును ఎదుర్కోబోతున్నామంటూ... అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కు అందజేసిన వార్షిక ఫైలింగ్ లో వెల్లడించింది. ట్రంప్ ఎన్నిక తమపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని పేర్కొంది. భౌగోళిక రాజకీయ అస్థిర పరిస్థితులు, ఉగ్రదాడులు కూడా తమ రెవెన్యూలు, లాభాలపై ప్రభావం చూపుతాయని తెలిపింది. ట్రంప్ ను అనుసరిస్తూ యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్ లు తీసుకున్న నిర్ణయాలు కూడా తమకు ముప్పుగా ఉన్నాయని పేర్కొంది.