: థెరిస్సా మేకు మెజారిటీ రాకపోవడంతో ప్రపంచ మార్కెట్లు కుదేలు


ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే తనకు పూర్తి అనుకూల ఫలితాలను రాబట్టుకోవడంలో విఫలమైందని వచ్చిన వార్తలు ప్రపంచ మార్కెట్లను కుదేలు చేశాయి. ఆమె పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేకపోవడం, హంగ్ దిశగా బ్రిటన్ పార్లమెంటు సాగడంతో సెన్సెక్స్, నిఫ్టీలు సహా పలు దేశాల సూచికలు నష్టపోయాయి. ఫలితాల సరళి వెలువడకముందే క్లోజ్ అయిన జపాన్ నిక్కీ 225, కొరియా సూచిక స్ట్రయిట్స్ టైమ్స్ స్వల్ప లాభాల్లో ఉండగా, హాంగ్ సెంగ్, తైవాన్ వెయిటెన్డ్, సెట్ కాంపోజిట్, జకార్తా కాంపోజిట్ నష్టపోయాయి. యూరప్ లో ఎఫ్టీఎస్సీ 100, డీఏసీ 40 ఫ్యూచర్స్ అర శాతానికి పైగా నష్టాలను చూపిస్తున్నాయి. అమెరికా మార్కెట్లో డౌ జోన్స్, ఎస్అండ్ పీ 500 ఫ్యూచర్స్ సైతం నష్టాలను చూపిస్తున్నాయి.

ఇక ఈ ఉదయం భారత మార్కెట్ ప్రారంభమైన తరువాత అమ్మకాల ఒత్తిడే అధికంగా కనిపించడంతో బెంచ్ మార్క్ సూచికలు జారిపోయాయి. ఈ ఉదయం 10:45 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 43 పాయింట్ల నష్టంతో, ఎన్ఎస్ఈ నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో సాగుతున్నాయి. ఓ దశలో 100 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, ఆపై ఫండ్ సంస్థల నుంచి వచ్చిన కొనుగోలు మద్దతుతో స్వల్పంగా కోలుకుంది. నిఫ్టీలో 19 కంపెనీలు లాభాల్లో నడుస్తుండగా, 32 కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News