: జియో రాకతో ఐడియాకు ఏర్పడిన నష్టం... జియో వల్లే మాయం!: కుమార మంగళం బిర్లా
రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో మొదలైన అనిశ్చితి ఇతర టెలికం కంపెనీలపై ఇప్పటికీ చూపిస్తోందని ఆదిత్య బిర్లా గ్రూప్ యజమాని, ఐడియా సెల్యులార్ ప్రమోటర్ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. తమ సంస్థకు జియో రాకతో ఏర్పడిన నష్టం, జియో వల్లనే మాయం కానుందని ఆయన అంచనా వేశారు. అయితే, తిరిగి లాభాల బాటలోకి ఐడియా రావడానికి మరో ఏడాది సమయం పడుతుందని, ఈలోగానే స్పష్టమైన రికవరీ చూపుతామని వాటాదారులకు రాసిన లేఖలో ఆయన అన్నారు. జియో తన వినియోగదారుల నుంచి డేటా చార్జీలను వసూలు చేయడం ప్రారంభించినందున, ఇతర సంస్థల నుంచి జియోకు మారాలని భావిస్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. జియో వల్లే తమ నష్టాలు నిదానంగానైనా మాయం కానున్నాయని అంచనా వేశారు.
తాజా వార్షిక నివేదికల్లో మెరుగైన ఫలితాలను నమోదు చేయడంలో వెనుకబడిన సెల్యులార్ కంపెనీలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం ముందడుగు వేయనున్నాయని తెలిపారు. 2016-17లో తమ ఆదాయం కేవలం 2 శాతం మాత్రమే తగ్గిందని కుమార మంగళం బిర్లా గుర్తు చేశారు. ఉచిత సేవలు ఎంతో కాలం అందించలేరన్న సంగతి తమకు తెలుసునని అన్నారు. ప్రపంచ స్థాయి నాణ్యత, మరింత వేగంతో కూడిన బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లను దేశవ్యాప్తంగా ఇవ్వడం తమ ముందున్న లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. వోడాఫోన్ కలిసిపోయిన తరువాత ఇండియాలో అతిపెద్ద టెలికం సంస్థగా ఐడియా అవతరించిందని, 40 కోట్ల మంది కస్టమర్లు 35 శాతం మార్కెట్ వాటా, 41 శాతం రెవెన్యూ మార్కెట్ వాటా తమదేనని అన్నారు.