: డొనాల్డ్ ట్రంప్ దిగజారిన సంభాషణ చేశారు: ఎఫ్బీఐ మాజీ చీఫ్ కొమె
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఎఫ్బీఐ మాజీ చీఫ్ జేమ్స్ కొమె ఆరోపణలు గుప్పించారు. తనను విధుల నుంచి తొలగించే వరకూ ట్రంప్ తనను ఏ రకంగా లక్ష్యం చేసుకున్నదీ సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీకి వివరించారు. మొత్తం ఏడు పేజీల సాక్ష్యాన్ని ఆయన సమర్పించారు. అందులో ఏమని పేర్కొన్నారంటే.. గతంలో సమావేశమైనప్పుడు ట్రంప్ తనతో ‘ఈ పదవిలో మీరు కొనసాగాలంటే..’ అని మొదలెట్టారని, ఆ సమయంలో తాను మౌనంగా ఆయన వైపు చూశానని పేర్కొన్నారు. మైక్ ఫ్లైన్ పై కేసును వదిలివేయాలని ట్రంప్ కోరారని, రష్యా జోక్యంపై దర్యాప్తును ఓ మేఘంతో ట్రంప్ పోల్చారని అన్నారు. అప్పటికే తాను ట్రంప్ దర్యాప్తు పరిధిలోకి రాననే విషయాన్ని మూడుసార్లు ఆయనకు చెప్పినట్టు పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరి 6న ట్రంప్ ను తొలిసారిగా ట్రంప్ టవర్స్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో కలిసి, ఆయనపై వచ్చిన లైంగిక, ఇతర ఆరోపణల విషయాలను ప్రస్తావించినట్టు తెలిపారు. జనవరి 27న వన్ టు వన్ డిన్నర్ లో మరోమారు ట్రంప్ ను కలిసిన సందర్భంలో ఆయన నుంచి దిగజారిన సంభాషణ వినాల్సి వచ్చిందని ఏడు పేజీల సాక్ష్యంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కొమె వ్యాఖ్యలపై ట్రంప్ తరపు న్యాయవాదులు స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్ తన సాయం కోరినట్టు కొమె చెబుతున్నారని, ఇదంతా అబద్ధమని అన్నారు. దర్యాప్తు అధికారులు అధ్యక్షుడి చెప్పుచేతల్లో ఉండరని అన్నారు.