: అర్ధగంటలో బిల్లు పాస్ చేసి ‘మమా’ అని పించారు: సీఎం చంద్రబాబు
రాష్ట్ర పునర్విభజన ద్వారా జరిగిన అవమానం మామూలు అవమానం కాదని, యుద్ధ విమానంలో బిల్లు పంపించి ఆమోదింప చేయించారని, పార్లమెంటులో డోర్లన్నీ క్లోజ్ చేసి, టీవీలు బంద్ చేసి, అర్ధగంటలో బిల్లు ఆమోదం పొందేలాచేసి ‘మమా’ అనిపించారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి మండిపడ్డారు. కాకినాడలో మహా సంకల్పం ప్రతిజ్ఞ అనంతరం ఆయన మాట్లాడుతూ, అడ్డమొచ్చిన మన ఎంపీలను చితకబాదారని విభజన నాటి విషయాలను ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోలేమని, అలా అని చెప్పి ఇంట్లో పడుకోలేమని, అందుకే, నవనిర్మాణదీక్ష చేపట్టామని అన్నారు. ‘పట్టుదలగా పనిచేసి మనకు ఉండే కోపాన్ని, కసిని కక్షగా మార్చుకుందాం. మనకు ఎవరైతే అన్యాయం చేశారో, వాళ్లు కుమిలి కుమిలి బాధపడే వరకు మనం పనిచేద్దామని నేనొక పిలుపు ఇచ్చాను. రాబోయే రోజుల్లో ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతా. ‘పోలవరం’ తెలుగుజాతికి జీవనాడి, వరం. ‘పోలవరం’ పూర్తి చేసుకుంటే కరవు రహిత రాష్ట్రంగా తయారు చేయవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2018 కల్లా గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని సంకల్పం చేసుకున్నాం. 2019 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం’ అని చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు.