: విద్యుత్ కోతలపై ఆగ్రహం.. సిబ్బందిపై కాల్పులు జరిపిన రిటైర్డ్ మేజిస్ట్రేట్!
అంతులేని కరెంట్ కోతలపై తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ విశ్రాంత మేజిస్ట్రేట్... విద్యుత్ సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన హర్యానాలోని గుర్ గావ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, రిటైర్డ్ మేజిస్ట్రేట్ ఏకే రాఘవ్ గుర్ గావ్ లోని సివిల్ లైన్స్ లో నివాసం ఉంటున్నారు. ఎలక్ట్రిసిటీ సిబ్బంది నిన్న ఆయన ఇంటికి సమీపంలో మరమ్మతులు నిర్వహించారు. ఈ క్రమంలో తరచూ కరెంట్ కట్ చేస్తున్నారు. దీంతో రాఘవ్ కు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే తన వద్ద ఉన్న తుపాకీ తీసుకుని వారి వద్దకు వెళ్లారు. ముందుగా గాల్లోకి కాల్చి... ఆ తర్వాత నాలుగు రౌండ్లు విద్యుత్ సిబ్బందిపై కాల్పులు జరిపారు.
అయితే, ఈ కాల్పుల్లో ఎవరికీ ప్రమాదం జరగలేదు. సమీపంలో ఉన్న ట్రాక్టర్ ట్రాలీకి కొన్ని బుల్లెట్లు తగిలాయని పోలీసు అధికారి తెలిపారు. ఘటన నేపథ్యంలో, రాఘవ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశామని చెప్పారు.