: ‘రాబ్తా కథ కేసు’లో వెనక్కి తగ్గిన అల్లు అరవింద్.. రేపు విడుదల కానున్న బాలీవుడ్ సినిమా!
సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతిసనన్ జంటగా నటించిన బాలీవుడ్ సినిమా ‘రాబ్తా’ ట్రైలర్‌ను చూసిన తరువాత నిర్మాత అల్లు అరవింద్ ఆ సినిమా ‘మగధీర’ సినిమాకు కాపీ అంటూ రాబ్తా యూనిట్ పై కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే, అల్లు అరవింద్ ఈ విషయంపై వెనక్కుతగ్గారు. రాబ్తా యూనిట్ వాదనతో సంతృప్తి చెందిన న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అల్లు అరవింద్ తాను వేసిన కేసును ఈ రోజు ఉదయం వెనక్కి తీసుకున్నారు.
దీంతో రేపు రాబ్తా రిలీజ్ కానుంది. దినేష్ విజన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలోని కథ తెలుగు సినిమా మగధీర కథకు దగ్గరగా ఉందని ఆరోపణలు వచ్చాయి. మగధీరలోలాగే హీరో, హీరోయిన్లు వందల ఏళ్ల కింద ప్రేమించుకోవటం, తిరిగి జన్మించి తమ ప్రేమను నిలుపుకోవడంతో పాటు ఈ బాలీవుడ్ మూవీలో హీరో వంద మందితో ఫైటింగ్ చేయడం వంటి సీన్లు కనిపించడం ఆ ఆరోపణలకు బలం చేకూర్చాయి. చివరికి అల్లు అరవింద్ కేసు వెనక్కి తీసుకోవడంతో లైన్ క్లియర్ అయింది.