: ట్రైన్ లోని బాత్రూంలో డైలాగులు వల్లెవేస్తున్న నటుడు... ఉగ్రవాది అనుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ప్రయాణికుడు!
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని మెట్రో రైల్ లో ప్రయాణిస్తూ డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్న ఓ నటుడిని ఉగ్రవాదని ప్రయాణికులు పొరబడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.... ఫ్రాన్స్ కి చెందిన నటుడు తాను నటించబోయే ఇంగ్లిష్ సినిమా కోసం మెట్రోరైల్ లోని ఒక బోగీ బాత్రూంలో కూర్చుని డైలాగులు ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. ఆ డైలాగుల్లో వెపన్, గన్ వంటి పదాలు ఉండడంతో ప్రయాణికుల్లో ఒక వ్యక్తి ట్రైన్ లో సైరన్ మోగించి, అనుమానాస్పద వ్యక్తి ఎవరితోనో బాత్రూంలో ఆయుధాల గురించి మాట్లాడుతున్నాడని పోలీసులకు సమాచారం అందించాడు.
దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. తాను ఆర్టిస్ట్ నని, తాను నటించబోయే సినిమాలో సన్నివేశానికి చెందిన డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నానని వివరించాడు. దీంతో అతను చెప్పేది నిజమని నిర్ధారించుకున్న పోలీసులు, చివరికి అతనిని విడిచిపెట్టారు. కాగా, 2015 నవంబర్ లో జరిగిన పారిస్ ఉగ్రదాడుల్లో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఏమాత్రం అనుమానాస్పదంగా కనిపించినా పోలీసులు వేగంగా స్పందిస్తున్నారు.