: కర్ఫ్యూను లెక్కచేయని మధ్యప్రదేశ్ రైతన్న... ఇతర జిల్లాలకు పాకిన అల్లర్లు... షాపుల లూటీలు!


తమకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ మధ్యప్రదేశ్ లో రైతులు ప్రారంభించిన ఉద్యమం, మొన్నటి పోలీసుల కాల్పుల్లో ఐదుగురు మరణించిన తరువాత తీవ్ర రూపం దాల్చింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, కర్ఫ్యూ విధించినప్పటికీ, రైతుల ఆందోళన మంద్ సౌర్ జిల్లాను దాటి పక్క ప్రాంతాలకు విస్తరించింది. ఈ ఉదయం తీవ్ర నిరసన తెలిపిన రైతులు మంద్ సౌర్ టోల్ ప్లాజాను ధ్వంసం చేశారు. రోడ్లపై ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పలు షాపులను లూటీ చేశారు. గోడౌన్లను ధ్వంసం చేశారు.

కాగా, ఈ ప్రాంతానికి మరిన్ని భద్రతా బలగాలను తరలిస్తున్నామని, శాంతి మార్గాన్ని వీడి అల్లర్లకు దిగే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. మంద్ సౌర్ ఘటనలో కాల్పులకు ఆదేశాలిచ్చిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కలెక్టర్, జిల్లా ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రైతులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిరసనల్లో అసాంఘిక శక్తులు ప్రవేశించాయని ఆరోపించారు.

  • Loading...

More Telugu News