: మమ్మల్నే బ్లాక్ చేస్తారా? మీ సంగతి చూస్తాం..: ట్రంప్‌ను హెచ్చరిస్తున్న 'ట్విటరాటీ'లు!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ట్విటరాటీలు మండిపడుతున్నారు. తమను వెంటనే అన్‌బ్లాక్ చేయకుంటే న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు. అభిప్రాయాలను నిష్కర్షగా వెల్లడిస్తుండడంతో తమను బ్లాక్ చేశారని, వెంటనే అన్‌బ్లాక్ చేయకుంటే న్యాయపోరాటం తప్పదని చెబుతున్నారు.

ఈ మేరకు ఇద్దరు ట్విట్టర్ యూజర్లు లాయర్ల ద్వారా శ్వేతసౌధానికి ఓ లేఖ పంపించారు. అధ్యక్షుడి ఖాతా నుంచి వెంటనే తమను అన్‌బ్లాక్ చేయాలని అందులో డిమాండ్ చేశారు. తమను బ్లాక్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై వైట్‌హౌస్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. ట్రంప్‌ను హెచ్చరిస్తున్న ఇద్దరిలో ఒకరు లిబరల్ యాక్టివిస్ట్ కాగా మరొకరు సైక్లిస్ట్. తాను రిజిస్టర్డ్ రిపబ్లికన్‌నని, తాను పలు ఫిర్యాదులు, ట్రంప్‌పై జోకులతో ట్వీట్లు, రీట్వీట్లు చేస్తుంటానని సైక్లిస్ట్ తెలిపాడు. ఇటీవల ట్రంప్ చేసిన ట్వీట్లకు రిప్లై ఇచ్చిన తమను బ్లాక్ చేశారని ఇద్దరు యూజర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వీరి డిమాండ్‌పై మాట్లాడేందుకు ట్విట్టర్ యాజమాన్యం నిరాకరించింది. వారి నుంచి తమకు ఫిర్యాదు అందలేదని పేర్కొంది.

  • Loading...

More Telugu News