: పాకిస్థాన్ బరితెగింపు.. భక్తులు ఇచ్చే డబ్బులను ఉగ్రవాదులకు పంపిణీ చేస్తున్న దాయాది!
ఉగ్రవాదంపై తమకున్న ప్రేమను పాకిస్థాన్ మరోమారు బయటపెట్టింది. ప్రార్థనా మందిరాల్లో భక్తులు సమర్పించే కానుకలను ఐఎస్ఐ గూఢచారులకు ఇస్తూ ఉగ్రవాదాన్ని పురికొల్పుతోంది. హుండీల్లోని డబ్బులను తీసి ఉగ్రవాదులకు ఇస్తూ భారత సరిహద్దు గ్రామాల్లో ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు ప్రయత్నిస్తోంది. రాజస్థాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ విషయాన్ని కనుగొన్నాయి.
ఐఎస్ఐ గూఢచారి దీనాఖాన్ ఇంటరాగేషన్ సందర్భంగా ఈ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. బెర్మార్ జిల్లాలో గతవారం ఇతడు పోలీసులకు చిక్కాడు. బెర్మూర్ జిల్లా చోటాన్ గ్రామంలోని చిన్న మసీదుకి తాను ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నానని, దానికి భక్తులు సమర్పించిన రూ.3.5 లక్షల విరాళాలను సత్రాం మహేశ్వరి, అతడి మేనల్లుడు వినోద్ మహేశ్వరి తదితర గూఢచారులకు పంపిణీ చేసినట్టు దర్యాప్తులో దీనాఖాన్ వెల్లడించాడు. పాకిస్థాన్ నుంచి ఫోన్‌లో వచ్చిన ఆదేశాల మేరకే దీనాఖాన్ సొమ్ములు పంచిపెట్టినట్టు ఇంటెలిజెన్స్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రార్థనా మందిరాల్లో ఐఎస్ఐ ఇటువంటి డొనేషన్ బాక్స్‌లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. హవాలా నెట్‌వర్క్ ద్వారా డబ్బుల పంపిణీ కష్టం కావడంతో ఈ మార్గాన్ని ఎంచుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.