: ప్లాస్టిక్ బియ్యం వార్తలు నమ్మకండి.. అది శుద్ధ అబద్ధం.. స్పష్టం చేసిన తెలంగాణ సర్కార్
ప్లాస్టిక్ బియ్యం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ. గత మూడు రోజులుగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్లాస్టిక్ రైస్‌పై ఎడతెగని చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే ఈ వార్తలు హోరెత్తిపోతున్నాయి. మార్కెట్‌ను ప్లాస్టిక్ బియ్యం ముంచెత్తుతోందంటూ, ఏవి అసలో, ఏవి ప్లాస్టిక్వో పోల్చుకోలేకుండా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మీడియాలోనూ ఇవే ప్రధాన వార్తలు అయ్యాయి.
దీంతో ప్రభుత్వం స్పందించింది. ప్లాస్టిక్ బియ్యంపై వస్తున్న వార్తలన్నీ అబద్ధమని, పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ రూమర్లు వస్తున్న ప్రాంతాల్లోంచి సేకరించిన బియ్యాన్ని ప్రాథమికంగా పరీక్షించగా ప్లాస్టిక్ రైస్ ఆనవాళ్లు లేవని తేలిందన్నారు. సేకరించిన బియ్యానికి మరిన్ని పరీక్షల కోసం ఫుడ్ లేబొరేటరీకి కూడా పంపించినట్టు తెలిపారు. అక్కడి నుంచి నివేదిక రాగానే మరోసారి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ప్లాస్టిక్ బియ్యం వార్తలు రాగానే పౌరసరఫరాల శాఖ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెంటనే రాష్ట్రంలోని అన్ని గోడౌన్లు, రైస్ మిల్లులపై దాడిచేసి శాంపిళ్లు సేకరించినట్టు ఆనంద్ తెలిపారు.