: చూడ్డానికి అచ్చం అబ్బాయిలా ఉందని... బాలికను సాకర్ ఆడనివ్వలేదు!
అమెరికా నెబ్రాస్కా రాష్ట్రంలోని ఒమహ పట్టణంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అక్కడ జరుగుతున్న పోటీలో అజూరి-కాచరోస్ చికాస్ సాకర్ జట్టు తరఫున ఆడేందుకు ఎనిమిదేళ్ల బాలిక మిలి హెర్నాండేజ్ వచ్చింది. జూనియర్స్ జట్టులో తన తోటి ఆడ పిల్లలందరూ ఆడుతున్నారు. అంతలోనే ఆమెకు ఆ టోర్నీ నిర్వాహకులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆ బాలిక చూసేందుకు అచ్చం అబ్బాయిలా ఉందని అన్నారు. ఆ టోర్నీలో ఆడేందుకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. చూడ్డానికి అసలే అబ్బాయిలా కనిపిస్తోన్న ఆ అమ్మాయికి మరో మైనస్ పాయింట్ తన హెయిర్‌స్టైల్ అయింది. ఆ అమ్మాయి అచ్చం అబ్బాయిల్లా కటింగు చేయించుకుంది.
కేవలం మిలి మాత్రమే కాదు.. ఆమె ప్రాతినిధ్యం వహిస్తోన్న జట్టును సైతం టోర్నీలో నుంచి తీసేశారు. మిలిని అక్కడకు తీసుకొచ్చిన కోచ్‌లు ఎంతగా చెప్పినా నిర్వాహకులు ఒప్పుకోలేదు. దీంతో మిలీ తన జట్టుతో పాటు నిరాశగా వెనుదిరిగింది. మిలి మంచి క్రీడాకారిణి అని, ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని, మళ్లీ నిర్వహించే ఇతర టోర్నీలో తప్పకుండా ఆడేలా చేస్తామని ఆమె కోచ్ చెప్పారు. ఆమె జట్టు నిరుత్సాహానికి గురికావద్దని అన్నారు. టోర్నీ నిర్వాహకుల నిర్లక్ష్యంపై పలువురి నుంచి విమర్శలు వస్తున్నాయి. తనను టోర్నీలో ఆడనివ్వనందుకు నిరాశ చెందానని ఆ పాప చెప్పింది.. మీరూ చూడండి....