: యూపీ ఆసుపత్రిలో ఎయిర్ కూలర్లు మూడు గంటల ముచ్చటే!
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ తో కలిసి అలహాబాద్ లోని స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రిలో తనఖీలు నిర్వహించేందుకు వెళ్లారు. అయితే, ఈ సమాచారం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆసుపత్రిని శుభ్రం చేయించారు. అంతేకాదు, రోగుల కోసం ఎయిర్ కూలర్లు అద్దెకు తెప్పించి మరీ ఏర్పాటు చేశారు. సీఎం రావడం, ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టడం, తిరిగి వెళ్లిపోవడం జరిగింది. అంతే, యోగి అక్కడి నుంచి వెళ్లిపోయిన మరుక్షణమే కూలర్లు ఆగిపోయాయి. వెంటనే, వాటిని తిరిగి పంపించేశారు. సీఎం పుణ్యమా అని కొన్ని గంటల పాటు చల్లని గాలిని ఆస్వాదించిన రోగులకు ఆపై నిరాశే మిగిలింది.