: భారత 'బాహుబలి రాకెట్' విజయాన్ని ప్రస్తావిస్తూ, 'ది వాషింగ్టన్ పోస్ట్' ప్రశంసలు!


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతం చేసిన అత్యంత బరువైన రాకెట్ జీఎస్ఎల్వీ ఎంకే-3 ప్రయోగంపై విదేశీ మీడియా ప్రశంసలు కురిపించింది. వాణిజ్య పరమైన శాటిలైట్ల ప్రయోగం విషయంలో ఎన్నో దేశాల కన్నా భారత్ ముందు నిలిచిందని 'ది వాషింగ్టన్ పోస్ట్' కొనియాడింది. సుమారు 300 బిలియన్ డాలర్ల విలువకు పెరిగిన కమర్షియల్ శాటిలైట్ లాంచింగ్ వ్యాపారంలో ఇకపై ఇస్రోదే కీలక పాత్రని, ఎన్నో దేశాలు ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఉపగ్రహాల ప్రయోగం కోసం ఇండియా వైపు చూస్తున్నాయని పేర్కొంది. భూ ఉపరితలాన్ని దాటించి, మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లి, తీసుకురాగల సత్తా భారత్ కు అతి త్వరలోనే సాధ్యం కానుందని అంచనా వేసింది. కాగా, పూర్తి దేశీయంగా తయారైన ఈ రాకెట్ లో క్రయోజనిక్ ఇంజన్, లిక్విడ్ ఆక్సిజన్, హైడ్రోజన్ లను ఇంధనంగా వాడినట్టు ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. గత ఫిబ్రవరిలో 104 రాకెట్లను ఒకేసారి అంతరిక్షంలోకి పంపిన ఇస్రో, ఇప్పుడీ భారీ రాకెట్ ప్రయోగం ద్వారా మరో కీలక మైలురాయిని అధిగమించింది.

  • Loading...

More Telugu News