: ‘అలా చేయకపోతే నేను డీజేనే కాదు’ అంటున్న బన్నీ.. అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ ట్రైలర్ అదిరిపోయిందంతే!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఇందులో బ్రాహ్మణుడిగా పూజలు.... వంటవాడిగా వంటలు చేస్తూ బన్నీ కనపడిన తీరు అద్భుతంగా ఉంది. అల్లు అర్జున్ తనదైన శైలిలో పేల్చుతున్న డైలాగులు ఆ ట్రైలర్ ను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తున్నాయి. హీరోయిన్ పూజాహెగ్డే అందాలు, బన్నీ, పూజాహెగ్డే మధ్య రొమాన్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ‘ఇంగువ లేకుండా పులిహోర చేస్తూ సభ్యసమాజానికి మనమేం మెసేజ్ ఇస్తున్నట్లు?’.. అంటూ తనికెళ్ల భరణిని బన్నీ ప్రశ్నిస్తోన్న తీరు కితకితలు పెట్టిస్తోంది. ‘పైగా నాది మామూలు లవ్వా?’ అంటూ హీరోయిన్ కి బన్నీ ఓ మంత్రం చదివి వినిపించాడు. ‘మనం చేసే పనిలో మంచి కనిపించాలి కానీ, మనిషి కనపడనక్కర్లేదు’ అని బన్నీ మరో డైలాగ్ వదిలాడు. ‘ఈ రోజుల్లో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్ఛామి కాదు సర్.. యుద్ధం శరణం గచ్ఛామీ’ అంటూ బన్నీ సీరియస్ యాంగిల్లోనూ అదరగొట్టేశాడు.
‘సత్యనారాయణ పురం అగ్రహారం సాక్షిగా చెబుతున్నాను... నేను వాడిని చూసిన రోజే చంపకపోతే నా పేరు దువ్వాడ జగన్నాథమే కాదు’ అని బన్నీ మరో డైలాగు పేల్చాడు. ఇక ఇందులో కనిపిస్తోన్న బన్నీ డ్యాన్స్, ఫైట్స్, స్టైల్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ‘నేను మీలా పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు పెద్ద బాలశిక్ష మాత్రమే చదువుకున్నా’నని రావు రమేశ్ తనదైన శైలిలో ఓ డైలాగ్ వదిలాడు. ఈ సినిమాలో ఆయన నెగిటివ్ రోల్ పోషిస్తున్నట్లు అర్థమవుతోంది.