: మోదీ వద్దకు 'మహాభారతం' పంచాయితీ!
మన సినిమాల ఖ్యాతిని దిగంతాలకు చాటిన 'బాహుబలి' సినిమా స్ఫూర్తితో... భారీ ఎత్తున 'మహాభారతం' చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించనున్న ఈ సినిమాను వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. యాడ్ ఫిల్మ్ మేకర్ శ్రీకుమార్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, టైటిల్ కు సంబంధించి ఈ సినిమాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
'మహాభారతం' అనే టైటిల్ ను మర్చాలంటూ కేరళ హిందూ ఐక్య వేదిక ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది. దీంతో, టైటిల్ మార్చేందుకు చిత్ర యూనిట్ సంసిద్ధతను వ్యక్తం చేసిందట. అయితే, టైటిల్ ను మార్చాల్సిన అవసరం లేదంటూ చిత్ర యూనిట్ కు ప్రధాని మోదీ అండగా నిలబడినట్టు సమాచారం. భరత జాతి గర్వించే రీతిలో తీయబోతున్న ఈ సినిమా కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానంటూ చిత్ర యూనిట్ కు మోదీ లేఖ రాశారట. ఈ నేపథ్యంలో, టైటిల్ వివాదం గురించి, మోదీ ని కలిసి మాట్లాడాలనే యోచనలో యూనిట్ సభ్యులు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే మోదీ అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి, ఈ సమస్యను మోదీ ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.