: ప్రకాశం జిల్లా వైసీపీలో మరోసారి తేటతెల్లమైన విభేదాలు!


ప్రకాశం జిల్లా వైసీపీలో ప్రధాన నేతల మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన బావ అయిన వైవీ సుబ్బారెడ్డి (ఒంగోలు ఎంపీ)ల మధ్య సఖ్యత లేదనే విషయం ప్లీనరీ సందర్భంగా మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాల వారీగా పార్టీ ప్లీనరీలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ప్లీనరీలకు సుబ్బారెడ్డి హాజరుకావడం లేదు. ఆయన అందుబాటులో లేకపోవడం వల్లే ప్లీనరీలకు హాజరుకాలేదని కొందరు నేతలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో, నిన్న ఒంగోలులో వైసీపీ ప్లీనరీ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లలో సుబ్బారెడ్డి ఫొటో కనిపించకపోవడం చర్చనీయాంశం అయింది. నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా సుబ్బారెడ్డి ఫొటో కనిపించలేదు. సమావేశం హాలు లోపల వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మాత్రం ప్రొటోకాల్ ప్రకారం ఆయన ఫొటోను ఉంచారు. ఈ నేపథ్యంలో బాలినేని, సుబ్బారెడ్డిల మధ్య ఉన్న విభేదాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. 

  • Loading...

More Telugu News