: కత్తులు దూసి కిక్కురుమనకుండా కూర్చున్న పార్టీలు.. ఈవీఎం చాలెంజ్ నుంచి ఆ రెండు పార్టీలూ ఔట్!


డాంబికాలు పలికిన పార్టీలు తోకముడిచాయి. 'మాకు చాన్స్ ఇచ్చి చూడండి' అని గొంతెత్తిన పార్టీల నోళ్లు మూతపడ్డాయి. ఈవీఎం చాలెంజ్‌ నుంచి తప్పుకున్నాయి. చివరికంటా నిలిచిన సీపీఎం, ఎన్‌సీపీలు కూడా చివరి నిమిషంలో బరి నుంచి తప్పుకున్నాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయంటూ ఆప్, బీఎస్పీ తదితర ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యం కాదని ఎలక్షన్ కమిషన్ ఎంత మొత్తుకున్నా వినలేదు. దీంతో వాటిని ట్యాంపర్ చేసి చూపించాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ జూన్ 3న డేట్ ఫిక్స్ చేసి దేశంలోని గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించింది. ఈసీ సవాలుతో సదరు ఆరోపణలు గుప్పించిన పార్టీలు చాలెంజ్‌కు ముందుకు వచ్చేందుకు భయపడ్డాయి. సీపీఎం, ఎన్‌సీపీలు మాత్రం చాలెంజ్‌కు సై అన్నాయి.

శనివారం చాలెంజ్‌కు ఈ రెండుపార్టీలు సిద్ధం కావాల్సి ఉండగా చివరి నిమిషంలో అవి కూడా చేతులెత్తేశాయి. తామెప్పుడూ ఈవీఎంలను ట్యాంపర్ చేయాలని అనుకోలేదని, జస్ట్ ఈవీఎంల పనితీరు గురించి తెలుసుకునేందుకే అందులో పాల్గొనాలని అనుకున్నామని సీపీఎం జారుకుంది. ఎన్‌సీపీ కూడా అలాగే పేర్కొంది. ఈవీఎం చాలెంజ్‌లో పాల్గొనాలన్న ఉద్దేశం తమకు లేదని కేవలం చూసేందుకు మాత్రమే రావాలనుకున్నామని పేర్కొని బరి నుంచి తప్పుకున్నట్టు ప్రకటించింది. చివరికి కత్తులు దూసిన పార్టీలు ఈవీఎం చాలెంజ్‌లో పాల్గొని అభాసుపాలవడం కంటే ఇదే మేలని భావించి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News