: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించాడు: జగన్ పై సీఎం చంద్రబాబు విమర్శలు
ఈ రోజు విజయవాడలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు కురిపించారు. ‘తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించడం... తండ్రి చనిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేయడం.. ఆ తరువాత సీబీఐ, ఈడీ విచారణను ఎదుర్కోవడం.. జైలుకి వెళ్లడం జరిగింది. మళ్లీ రాష్ట్ర విభజన చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ రాజీపడి బెయిల్ ఇప్పించింది. అంటే ఈ నాటకాలన్నీ చూస్తే కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆడిన నాటకంగా తెలుస్తోంది’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.
‘మొన్న ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తామని చెప్పిన వైసీపీ నేతలు, ఇప్పుడు రాజీనామాలు చేయబోమని అంటున్నారు. ఒక అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. నేను బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానంటే అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. ఇంకా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ప్రయోజనాలు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నీ రాబట్టుకుంటున్నాం’ అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.