: ఐటీ రంగానికొచ్చిన నష్టమేమీ లేదు.. ఈసారి 20 వేల ఉద్యోగాలిస్తాం: ఇన్ఫోసిస్
భారతీయ ఐటీ రంగం కుదేలవుతుందని, ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ ఇన్పోసిన్ సీఓఓ ప్రవీణ్ రావు యువతకు శుభవార్త చెప్పారు. తమ సంస్థలో పనితీరు ఆధారంగా 400 మందిని మాత్రమే తొలగిస్తున్నట్లు తెలిపిన ఆయన... ఈ ఏడాదిలో తమ సంస్థలో ఏకంగా 20,000 ఉద్యోగాల నియామకం జరగనుందని పేర్కొన్నారు. ఉద్యోగాల కోత అంటూ పలు మాధ్యమాల్లో ఎక్కువ చేసి చూపారని తెలిపారు. తాజాగా ఆయన కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. ప్రతి ఏడాది ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఉద్యోగులను తొలగించడం సాధారణ ప్రక్రియేనని అన్నారు.
సాధారణంగా తమ సంస్థలో ప్రతి ఏడాది 300 నుంచి 400 మంది ఉద్యోగులను తొలగిస్తామని ప్రవీణ్ రావు తెలిపారు. ఇప్పటికే ఈ ఏడాదిలో తమ కంపెనీ 10,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుందని తెలిపారు. ఇక టీసీఎస్‌లో గత మూడేళ్లలో 2.5 లక్షల నియామకాలు జరిగాయని, ఈ ఏడాది ఆ కంపెనీ కూడా 20,000 మందిని నియమించుకోనుందని తెలిపారు. భారతీయ ఐటీ రంగం కుదేలు అవుతుందంటూ చర్చలు జరపడం అనవసరమని చెప్పారు.