: సచివాలయం లేదని చంద్రబాబు ఏడుస్తుంటే.. ఉన్నదాన్ని కూల్చేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు: జైపాల్ రెడ్డి ఫైర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, బీజేపీపైన కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. పెద్ద నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జనజీవనం అతలాకుతలమైందని ఆయన అన్నారు. ప్రజలను ఈ విధంగా బాధించే అధికారం ఏ ప్రధానికీ లేదని చెప్పారు. ముడి చమురు ధర పెరిగిందనే కారణంతో ఎప్పటి కప్పుడు పెట్రోలు ధరలను పెంచుతున్నారని... ముడి చమురు ధరలు తగ్గినప్పుడు మాత్రం పెట్రోలు ధరలను తగ్గించడం లేదని మండిపడ్డారు. పెట్రోల్ ధరలను తగ్గించకపోవడం వల్ల కేంద్రానికి రూ. 20 వేల కోట్లు ఆదా అయిందని చెప్పారు.

అధికారంలోకి రావడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి అడ్డగోలు హామీలన్నీ ఇస్తున్నారని జైపాల్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని దుబారాగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. సెక్రటేరియట్ కూడా లేదని ఓ వైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడుస్తుంటే... ఉన్న సచివాలయాన్ని కూల్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సెక్రటేరియట్ వల్ల ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. ప్రజలకు దీనివల్ల ఏ ఉపయోగం లేదని... కేసీఆర్ కు మాత్రం పండగ అని అన్నారు.

  • Loading...

More Telugu News