: బిర్యానీలో బల్లి.. అస్వస్థతకు గురైన ముగ్గురు కస్టమర్లు
బల్లి ఉన్న బిర్యానీని తిని ముగ్గురు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలోని గడియారం స్తంభం సెంటర్ లోని ఓ రెస్టారెంట్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, బోస్ నగర్ కు చెందిన నరేంద్ర, థామస్ పేటకు చెందిన శ్యామ్, గొల్లపాలెంకు చెందిన దొంతేశ్వరరావులు రెస్టారెంట్ కు వెళ్లి బిర్యానీ తెప్పించుకున్నారు. నరేంద్ర కొంచెం బిర్యానీ తిన్నాడు. ఆ తర్వాత బిర్యానీలో బల్లి కనిపించడంతో... మిగతా ఇద్దరిని బిర్యానీ తినవద్దని వారించాడు. ఆ తర్వాత వాంతి చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో, నరేంద్రను వారిద్దరూ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, జరిగిన ఘటనతో మిగిలిన ఇద్దరికీ బీపీ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. దీంతో, వారు కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో వీరు ముగ్గురికీ చికిత్స అందించారు. నరేంద్రలో విషం ఉన్న లక్షణాలు లేవని డాక్టర్లు తెలిపారు. దీంతో, కాసేపటికి వారు ముగ్గురూ కుదుటపడ్డారు.