: టీమిండియాతో కొనసాగేందుకు కుంబ్లే ససేమిరా అంటున్నాడా?
టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లీ మధ్య విభేదాలు తలెత్తినట్టు గత వారం రోజులుగా మీడియాలో కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ప్రాక్టీస్ లో కూడా వీరిద్దరూ కలవడం లేదని, వీరి మధ్య దూరం పెరిగిందని వార్తలు వస్తున్నాయి. రవిశాస్త్రి మేనేజర్ గా ఉండగా కోహ్లీ ఆయనతో సన్నిహిత సంబంధాలు నెరపాడు. అయితే కుంబ్లే కఠినంగా వ్యవహరించడాన్ని టీమిండియా సీనియర్లు అంగీకరించడం లేదని, దీంతోనే కుంబ్లేపై గుర్రుగా ఉన్నారని, అదీ కాక కుంబ్లే మీటింగ్ విశేషాలను తన వర్గానికి చెందిన జర్నలిస్టులతో పంచుకుని, రహస్యంగా ఉంచాల్సిన వివరాలను లీక్ చేస్తున్నాడని కూడా ఆరోపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆటగాళ్లు, కోచ్, కెప్టెన్ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రంగంలోకి దిగాడు. అలాగే జట్టుతో బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌధురి, బీసీసీఐ జనరల్ మేనేజర్ ఎంవీ శ్రీధర్ కూడా చర్చించారు. ఈ నేపథ్యంలో కోచ్ గా కొనసాగేందుకు అనిల్ కుంబ్లే అనాసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో గంగూలీ, సచిన్, లక్ష్మణ్ తో కూడిన బీసీసీఐ సలహా సంఘం నిర్వహించే ముఖాముఖికి హాజరు అయ్యేందుకు కూడా ఆయన సిద్ధంగా లేదని తెలుస్తోంది. దీనికి ఆయన హాజరుకాని పక్షంలో ఆయన స్థానంలో కొత్త కోచ్ ను నియమించాల్సి ఉంటుంది. కాగా, బీసీసీఐ సలహా సంఘం మాత్రం కుంబ్లే సారథ్యంలో సాధించిన విజయాలే ఆయన నిబద్ధత, కోచింగ్ నైపుణ్యం ఏమిటో చెబుతున్నాయని, ఆయనే కోచ్ గా కొనసాగాలని భావిస్తోంది.