: రాహుల్ చెప్పింది చేసిన హనుమన్న... జగ్గారెడ్డికి బ్రాస్ లెట్ అందించిన వీహెచ్!
సంగారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్న మాటకు కట్టుబడి టీపీసీసీ అధికార ప్రతినిధి జగ్గారెడ్డికి బ్రాస్ లెట్ ను అందిస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. సంగారెడ్డిలోని జగ్గారెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన తన చేతికి ఉన్న బ్రాస్ లెట్ ను తీసి, జగ్గారెడ్డి చేతికి అలంకరించారు. అనంతరం వీహెచ్ మాట్లాడుతూ, గతంలో రాజీవ్ గాంధీ ఆంధ్రప్రదేశ్ లోని లంక గ్రామాల్లో పడవలో పర్యటిస్తున్న సమయంలో అక్కడే ఉన్న తనతో ‘నా కోసం ఏదైనా చేస్తానని తరచూ చెబుతుంటావు కదా! ఈ నదిలో దూకుతావా?’అని సరదాగా వ్యాఖ్యానించారని, ఆ వెంటనే తాను నదిలో దూకి తన విశ్వాసాన్ని నిరూపించుకున్నానని వీహెచ్ గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు జగ్గారెడ్డికి బ్రాస్ లెట్ ను ఇవ్వడం మంచి సంప్రదాయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని మెదక్ నుంచి పోటీ చేయాలని కోరుతామని ఆయన చెప్పారు.