: సాయి భక్తుల పాదశక్తి నుంచి విద్యుదుత్పత్తి.. షిర్డీలో త్వరలో సాకారం?
షిర్టీ సాయిబాబా ట్రస్ట్ ఓ కొత్త ఆలోచనను అమలు చేయబోతోంది. షిర్డీ సాయిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల పాదాల శక్తి నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయాలనుకుంటోంది. ట్రస్ట్ చైర్మన్ సురేష్ హవారే విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. ‘‘సాయిబాబాను ప్రతి రోజు సుమారు 50వేల మంది దర్శించుకుంటుంటారు. క్యూలైన్ పొడవునా ఎనర్జీ పెడల్స్ ను ఏర్పాటు చేస్తాం. భక్తులు వాటిపై నడిచినప్పుడు అవి ఒత్తిడికి గురవుతాయి. మళ్లీ తిరిగి యథాస్థితికి వస్తాయి. ఆ సమయంలో శక్తి వెలువడుతుంది. దాన్ని విద్యుత్ గా మారుస్తాం. ఈ విద్యుత్ ను ఆలయంలో బల్బులు, ఫ్యాన్లకు వినియోగించుకుంటాం‘‘ అని వివరించారు. ఇక గిరిజన, నిరుపేదల కోసం గాను ఓ ఐఏఎస్ అకాడమీ, కేన్సర్ ఆస్పత్రి, చెత్త నుంచి విద్యుదుత్పత్తికి ప్లాంట్ తదితర కార్యక్రమాలను సాయిబాబా శతాబ్ధి మహోత్సవాల నేపథ్యంలో చేప్టటనున్నట్టు చెప్పారు. ఈ ఉత్సవాలు వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి 18 వరకు జరగనున్నాయి.