: పారిస్ ఒప్పందం విషయంలో ట్రంప్ ఆ నాలుగు దేశాల అగ్రనేతలకు వివరించారు!: వైట్ హౌస్
ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్‌హౌస్ ఉద్గారాల్లో అధిక శాతం విడుదల చేస్తున్న సుమారు 70 దేశాలు గతంలో చేసుకున్న ‘పారిస్ ఒప్పందం’ నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం గురించి ఆ ఒప్పందంలో ఉన్న కీలక దేశాలకు ట్రంప్ చెప్పారా? అనే ప్రశ్నపై వైట్ హౌస్ స్పందించింది. ఆ ఒప్పందం నుంచి తమ దేశం వైదొలగడానికి గల కారణాలను పలు దేశాల నేతలకు తమ అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెప్పారని స్పష్టం చేసింది. అయితే, ఈ నిర్ణయం తీసుకున్న అనంతరం ఫోన్ చేశారా..? అంతకు ముందే చేశారా..? అనే విషయంపై మాత్రం వివరణ ఇవ్వలేదు. ట్రంప్.. జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, యూకె ప్రధాని థెరిస్సా మేలతో ఈ విషయం గురించి చెప్పారని వైట్‌హౌస్ పేర్కొంది.
ఈ సందర్భంగా మోదీ ఆయా దేశాల అగ్రనేతలకు ఓ హామీ కూడా ఇచ్చారని వైట్‌హౌస్ తెలిపింది. అట్లాంటిక్ కూటమికి తాము కట్టుబడి ఉన్నామని, పర్యావరణ పరిరక్షణపై తగిన నిర్ణయాలు తీసుకుంటామని ట్రంప్ చెప్పారని పేర్కొంది. తమ దేశం పర్యావరణ పరిరక్షణకు అనుకూల దేశమని చెప్పారని తెలిపింది. పారిస్ ఒప్పందం నుంచి వైదొలగినప్పటికీ అందులోని వాతావరణ పరిరక్షణ అంశాలకి కట్టుబడి ఉంటామని ట్రంప్ అన్నారని చెప్పింది.