: పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పిన భారత్.. ఇండియన్ ఆర్మీ చేతిలో ఐదుగురు పాక్ రేంజర్ల హతం
భారత్, పాకిస్థాన్ సరిహద్దు వద్ద రెచ్చిపోతూ కాల్పులకు తెగబడుతున్న పాక్ రేంజర్ల తీరు ఎంతకీ మారకపోతుండడంతో భారత్ మరోసారి గట్టిగా బుద్ధి చెప్పింది. భారత్ ఎదురుతిరిగి దాడి చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపించింది. జమ్ముకశ్మీర్‌లోని భింబర్, బట్టల్ సెక్టార్లలో భారత ఆర్మీ చేతిలో ఈ రోజు ఐదుగురు పాక్ రేంజర్లు హతమయ్యారు. మరో ఆరుగురు రేంజర్లకి గాయాలయ్యాయి.
సరిహద్దు వద్ద పాక్ ఆర్మీ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ రెచ్చిపోతోంది. ఈ రోజు ఉదయం కూడా కాల్పులకు తెగబడి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇటీవలే పాక్ శిబిరాలను భారత్ ధ్వంసం చేసినప్పటికీ పాక్ తన తీరు మార్చుకోకుండా రెచ్చిపోతోంది. ఇటీవలే పాక్ జరిపిన కాల్పుల్లో సరిహద్దు ప్రాంతంలో పలువురు కూలీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాక్ చర్యలను ఏ మాత్రం ఉపేక్షించబోమని తెలుపుతూ భారత్ దీటుగా సమాధానం ఇస్తోంది.