: ఆ విషయం ప్రియాంక చోప్రాని లేక ప్రధాని మోదీని అడగండి: అమితాబ్ బచ్చన్ సమాధానం
జర్మనీ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అక్కడే ఉన్న నటి ప్రియాంక చోప్రా కలిసిన నేపథ్యంలో ఆమె వేసుకున్న దుస్తులు, కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న తీరుపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై భారత దిగ్గజనటుడు అమితాబ్ బచ్చన్ కూడా స్పందించాల్సి వచ్చింది. దీనిపై ఆయన పలు ప్రశ్నలు వేశారు. ఇటీవల ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమంలో మీడియా ఈ విషయంపై ప్రశ్నిస్తూ.. ప్రధాని మోదీ ముందు ప్రియాంకా చోప్రా అలా కూర్చోవడంపై ఆయన అభిప్రాయం ఏంటని అడిగింది. దీంతో అమితాబ్ సమాధానం ఇస్తూ తానేమైనా ప్రియాంకా చోప్రానా? లేక ప్రధానమంత్రి మోదీనా? అని ఆయన ప్రశ్నించారు. 'వెళ్లి వారినడగండి' అని సమాధానమిచ్చారు.
మోదీతో ప్రియాంక మాట్లాడుతుండగా కూర్చున్న విధానం, ఆమె వేసుకున్న దుస్తులపై నెటిజన్లు ఇంకా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుండడంతో తన ట్విట్టర్ ఖాతా నుంచి ప్రియాంక చోప్రా ఆ ఫొటోను తొలగించింది. అయితే, ఇప్పటికే ఆ ఫొటోను డౌన్లోడ్ చేసేసుకున్న నెటిజన్లు దాన్ని పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శల దాడి మాత్రం ఆపడం లేదు. అందులో ప్రధాని మోదీ సాధారణంగా కూర్చుంటే ప్రియాంక చోప్రా మాత్రం మోదీ ముందే కాలుమీద కాలేసుకుని కూర్చుంది.