: బాలీవుడ్ కు ఓ న్యాయం, టాలీవుడ్ కు మరో న్యాయమా?: జీఎస్టీ తారతమ్యంపై చంద్రబాబుకు నిర్మాతల ఫిర్యాదు
త్వరలో అమల్లోకి రానున్న గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ స్లాబుల్లో భాగంగా హిందీ సినిమాలపై 45 శాతం పన్నును 28 శాతానికి తగ్గించిన కేంద్రం, తెలుగు చిత్ర పరిశ్రమపై మాత్రం పన్నును రెట్టింపు చేశారని ఆరోపిస్తూ, దీని వల్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని నిర్మాతల సంఘం ఆరోపించింది. ఈ ఉదయం ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని కలిసిన నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, సీ కల్యాణ్, ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు, జీఎస్టీ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతమున్న 14 శాతం పన్నును 28 శాతానికి పెంచడం ద్వారా చిన్న చిత్రాల మనుగడ కుదేలవుతుందని తెలిపారు. పెంచిన పన్నును తగ్గించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. నిర్మాతల విన్నపాలపై సానుకూలంగా స్పందించిన సీఎం, ఈ విషయమై జైట్లీకి వెంటనే లేఖను రాయాలని ఆర్థికమంత్రి యనమలను ఆదేశించారు.