: వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారు... నేను బాధితురాలినైతే నన్నే సస్పెండ్ చేశారు: ఏవో నీరజ
ఓ ఫర్టిలైజర్ షాపు ఏర్పాటుకు అనుమతులు కోరితే, లంచం అడగడంతో పాటు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన ఆరోపణలపై సస్పెన్షన్ కు గురైన వికారాబాద్ ఏఓ నీరజ మీడియా ముందుకు వచ్చారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, అసలు బాధితురాలిని తానైతే, తననే సస్పెండ్ చేశారని వాపోయారు. కాగా, కన్నారెడ్డి అనే వ్యక్తి అనుమతులు కోరగా, లంచం కోరడంతో పాటు పోలీసులతో అతన్ని కొట్టించినట్టు నీరజపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే, తాను లంచం డిమాండ్ చేసినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, షాపునకు వెంటిలేటర్ లేకపోవడం వల్లనే అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. తనతో పాటు కార్యాలయంలో ఉన్న మరో ఇద్దరు మహిళా అధికారులపై కన్నారెడ్డి, ఆయన కుటుంబీకులు దౌర్జన్యానికి దిగి, వీడియోలు తీశారని ఆరోపించారు. వాటిని చూపి బ్లాక్ మెయిల్ చేస్తున్నందునే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. తన తప్పు లేకపోయినా రాత్రికి రాత్రే సస్పెండ్ చేశారని, ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.