: ఏపీలో బలపడేందుకు బీజేపీ ఎత్తులు... జూలై 15న వైజాగ్ లో ప్రధాని రోడ్ షో
ఉత్తరాదిలో ఎదురులేకుండా పోయిన బీజేపీ దక్షిణాదిపై దృష్టి సారించింది. రాష్ట్ర విభజనలో ప్రధాన పాత్ర పోషించామని, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని పేర్కొంటూ తెలంగాణలో విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. అంతకంటే ముందు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం, లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చామని పేర్కొంటూ ఏపీలో బలపడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా స్థానికేతరులు ఎక్కువ నివాసం ఉండే విశాఖపట్టణంలో పాగే వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
వైజాగ్ లో నేవల్ సిబ్బంది పెద్ద ఎత్తున విధులు నిర్వర్తిస్తూ నివాసం ఉంటారు. వారంతా బీజేపీకి అనుకూలంగా ఉంటారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన షిప్ యార్డ్, స్టీల్ ప్లాంట్, బీహెచ్ పీవీ, హెచ్ పీసీఎల్, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ వంటి సంస్థల ఉద్యోగులు కూడా వైజాగ్ లోనే నివాసం ఉంటారు. వీరిలో 40 శాతం మంది స్థానికేతరులు. వీరంతా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
అందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఇక్కడే నిర్వహించనుంది. జూలై నెలలో ఈ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జూలై 15న ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు రానున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు నుంచి అంటే ఎన్ఏడీ జంక్షన్ నుంచి పోతినమల్లయ్యపాలెం వరకు సుమారు 23 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించనున్నారు. వైజాగ్ ప్రధాన రహదారిని కలుపుతూ, నగరం నడిబొడ్డున సాగే ఈ రోడ్ షోకు విశేషమైన ఆదరణ లభించనుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. భువనేశ్వర్ లో నిర్వహించిన రోడ్ షోకు విశేషమైన ఆదరణ లభించిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజేపీ తెలిపింది. పోతినమల్లయ్యపాలెంలో గల స్టేడియం పక్కనున్న వీ కన్వెన్షన్ సెంటర్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నారు.