: ఇండియాకు తిరిగొచ్చిన చిదంబరం కుమారుడు
సీబీఐ కేసుల్లో భాగంగా విచారణను ఎదుర్కొంటూ, గత నెలలో లండన్ వెళ్లి కలకలం రేపిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం చెన్నై తిరిగి వచ్చారు. బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఆయన చెన్నై వచ్చారు. గత నెల 18న ఆయన లండన్ కు వెళ్లగా, మరో మాల్యా మాదిరి విచారణను తప్పించుకునేందుకు ఆయన పారిపోయాడని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒకప్పటి మీడియా దిగ్గజం పీటర్ ముఖర్జియాకు చెందిన ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు కావాల్సిన అనుమతుల విషయంలో అక్రమాలు జరిగాయని, అందులో కార్తి చిదంబరం పాత్ర కూడా ఉందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.