: బ్యాంకుపై వెరైటీ దాడి: లాకర్లు పగులగొట్టారు... డబ్బు దోచుకోలేదు.. రుణమాఫీ చేయమంటూ డిమాండ్ లేఖ!
కర్ణాటకలోని హుబ్బళ్లి పరిధిలోని నవలగుంద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గుర్తు తెలియని దుండగులు వెరైటీగా దోపిడీ చేశారు. షట్టర్ తాళాలను పగులగొట్టి లోపలికి వెళ్లిన వీరు, సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతో పాటు లాకర్లను పగులగొట్టారు. ఎలాంటి డబ్బు, నగదును దోచుకెళ్లకుండా, వెంటనే రుణమాఫీ చేయాలని లేకుంటే బ్యాంకును దోచుకుంటామని హెచ్చరిస్తూ ఓ లేఖను వదిలి వెళ్లారు. ఇదే ఇప్పుడు సంచలనమైంది. వీరు దొంగలా? కాదా? అన్న ప్రశ్న పోలీసులను వెంటాడుతోంది. రైతుల పేరిట కరపత్రాన్ని బ్యాంకులో వదిలి వెళ్లిన వీరు, కేసును తప్పుదారి పట్టించేందుకే ఇలా చేసి వుండవచ్చని అనుమానిస్తున్నా, వారు ఎలాంటి దోపిడీకి పాల్పడకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. లాకర్లను పగులగొట్టేంత శక్తి రైతులకు ఉండకపోవచ్చని, కేసును విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.