: 1080 విమానాలకు ఆర్డర్లు... మూడవ అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ చరిత్ర
1000కి పైగా కొత్త విమానాలను ఆర్డర్ చేసిన భారత విమానయాన కంపెనీలు ఇండియాను మూడవ అతిపెద్ద పాసింజర్ విమానాల కొనుగోలు దేశంగా నిలిపాయి. అత్యధికంగా విమానాలను కొనుగోలు చేస్తున్న దేశాల్లో తొలి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో చైనా ఉండగా, 3వ స్థానంలో నిలిచిన భారత్ కు భవిష్యత్తులో 1,080 విమానాలు డెలివరీ కానున్నాయి. ఈ విషయాన్ని సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఇండియాలో వివిధ ఎయిర్ లైన్స్ కు చెందిన 480 విమానాలు ఉండగా, వీటి సంఖ్య వచ్చే ఐదారేళ్లలో 1500 దాటనుంది. కాగా, కొత్త ఆర్డర్లలో లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థలైన ఇండిగో, స్పైస్ జెట్ లు అత్యధిక ఆర్డర్లు ఇచ్చాయి. త్వరలో జెట్ ఎయిర్ వేస్, విస్తారా సంస్థలు మరిన్ని విమానాల కొనుగోలుకు ఆర్డర్లు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
కాగా, వచ్చే ఐదేళ్ల వ్యవధిలో 400 విమానాలు, ఆపై మరో ఐదేళ్లలో 700 విమానాలు ఇండియాకు డెలివరీ కానుండగా, ఎయిర్ పోర్టుల విస్తరణ పనులు నత్తనడకన సాగుతూ ఉండటం, చిన్న విమానాశ్రయాల ఏర్పాటు ఆలస్యం అవుతూ ఉండటంతో ఎయిర్ లైన్స్ సంస్థల్లో కొంత ఆందోళన నెలకొని వుంది. మౌలిక వసతుల కల్పన వేగవంతం కాకుంటే అపారమైన వ్యాపార, అభివృద్ధి అవకాశాలున్న భారత ఏవియేషన్ ఇండస్ట్రీ వెనుకబడిపోతుందని నిపుణులు హెచ్చరించారు.
కాగా, భారత్ లో దేశవాళీ సేవలందించేందుకు ఖతార్ ఎయిర్ వేస్ సైతం ఆసక్తితో ఉంది. సమీప భవిష్యత్తులో విమానాల పార్కింగ్, రన్ వే స్లాట్ లు పెను సమస్యగా మారే ప్రమాదం ఉందని, ముఖ్యంగా మెట్రో ఎయిర్ పోర్టుల్లో విమానాలు నిలిపేందుకు కూడా స్థలం మిగలదని, ముంబై, చెన్నై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎయిర్ పోర్టుల్లో వచ్చే ఐదేళ్లలో కనీసం 400 విమానాలను నిలిపి ఉంచేలా పార్కింగ్ సౌకర్యాన్ని విస్తరించాల్సి వుందని సూచిస్తున్నారు.