: ఏటీఎంలు, ఇతర లావాదేవీలపై నేటి నుంచి మొదలైన ఎస్బీఐ బాదుడు... అదనపు భారం!
దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ సేవల సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విధించిన కొత్త చార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. మొబైల్ యాప్ 'ఎస్బీఐ బ్యాంక్ బుడ్డీ'తో నగదు విత్ డ్రా, తదితరాలకు కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి. ఇందులో భాగంగా, మొబైల్ వాలెట్ ను వాడి ఏటీఎం నుంచి డబ్బును తీసుకుంటే, ఒక్కో లావాదేవీకి రూ. 25 రూపాయలను వసూలు చేస్తారు. ఇక సాధారణ సేవింగ్స్ ఖాతాలపై మెట్రో నగరాల్లో ఎనిమిది ఉచిత ఏటీఎం లావాదేవీలు (ఎస్బీఐ ఏటీఎంలలో 5, ఇతర ఏటీఎంలలో 3) కొనసాగుతాయి. నాన్ మెట్రో ఏటీఎంలలో 10 ఉచిత లావాదేవీలకు అనుమతి వుంటుంది.
ఇక కొత్త వడ్డింపుల్లో భాగంగా, ఐఎంపీఎస్ లేదా ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ వాడుకుని నగదు బదిలీ చేస్తే, రూ. లక్ష వరకూ 5 రూపాయలు ప్లస్ సర్వీస్ టాక్స్, రూ. 2 లక్షల వరకూ లావాదేవీపై 15 రూపాయలు ప్లస్ సర్వీస్ టాక్స్, ఆపై రూ. 5 లక్షల వరకూ 25 రూపాయలు ప్లస్ సర్వీస్ టాక్స్ ను బ్యాంకు వసూలు చేస్తుంది. పాడైపోయిన నోట్లను మార్చుకోవాలని వెళితే, ఆ మొత్తం రూ. 5 వేల కన్నా ఎక్కువ లేదా 20 నోట్లు ఉంటే, ఒక్కో నోటుకు రూ. 2 ప్లస్ సర్వీస్ చార్జ్ ని బ్యాంకు వసూలు చేస్తుంది. ఇక కొత్త చెక్ బుక్ కావాలంటే రూ. 30 (10 చెక్కులు), రూ. 75 (25 చెక్కులు), రూ. 150 (50 చెక్కులు)కి తోడు అదనంగా సర్వీస్ టాక్స్ చెల్లించాల్సిందే. ఇక సాధారణ సేవింగ్స్ డిపాజిట్ ఖాతా కలిగివున్న వారు ఉచిత లావాదేవీల తరువాత, ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంను వాడి డబ్బు తీసుకుంటే రూ. 50 చెల్లించాల్సిందే.