: దాసరి మృతిపై అనుమానాలున్నాయంటున్న పెద్ద కోడలు... ఆరోపణలు!
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అంత్యక్రియలు పూర్తై 24 గంటలు కూడా గడవకముందే... ఆయన మృతిపై అనుమానాలున్నాయంటూ ఆయన పెద్ద కోడలు సుశీల ఆరోపించారు. హైదరాబాదులో మీడియాతో ఆమె మాట్లాడుతూ, ‘‘మా కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయన్న మాట వాస్తవమే... అయితే ఇంకా నాకు, నా భర్తకు విడాకులు కాలేదు. అసలు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా ఎలా? అనారోగ్యం పాలయ్యారు?... గతంలో నేను వచ్చినప్పుడు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశాను. ఆయన ఆసుపత్రిలో ఉండగా పరామర్శించేందుకు వస్తే... నన్ను కనీసం ఆయనను చూసేందుకు కూడా అనుమతించ లేదు. అప్పుడే అనుమానాలు వచ్చాయి. మొన్న మే 4న మామగారిని చూసేందుకు వెళ్తే...ఆయన ప్రేమగా మాట్లాడారు.
అంతేకాదు, నా కొడుకును సినీ రంగానికి పరిచయం చేస్తానని మాటిచ్చారు. ‘ఇంకొక చిన్న ఆపరేషన్ ఉంది. రెండు వారాలు ఆగి రండి. కూర్చుని మాట్లాడుకుందాం’ అని కూడా అన్నారు. మాకు ఆస్తిలో భాగం ఇవ్వలేదు. దీనిపై మాట్లాడుతూ, ‘ఎంతో మందికి జీవితాలిచ్చాను.. మీకు అన్యాయం చేయను. రెండు వారాల తర్వాత రండి, తప్పకుండా న్యాయం చేస్తా’నని ఆయన అన్నారు. అంతేకాదు 'నా మనవడిని నాతోనే ఉంచుకుంటా'నని ఆయన చెప్పారు. అలాంటి ఆయన ఇంత హఠాత్తుగా మృతి చెందడమేంటి? ఆయన మృతిపై నాకు అనుమానాలున్నాయి’’ అని ఆమె ఆరోపించారు.
అయితే, ఆమె ఆరోపణలపై దాసరి అభిమానులు మండిపడుతున్నారు. కర్మకాండలు పూర్తి కాకముందే ఆస్తికోసం ఆరోపణలు చేస్తోందని మండిపడుతున్నారు. కాగా, దాసరి పెద్ద కుమారుడు ప్రభు భార్య సుశీల కావడం విశేషం. వారిద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి.