: నీ తండ్రికి ఏ శిక్ష వేయాలి?... చిన్నారిని అడిగిన జడ్జి!: వీడియో వైరల్.. ఒక్క రోజులో కోటి మంది చూసేశారు!
నీ తండ్రికి ఏ శిక్ష వేయాలని ఓ చిన్నారిని ఓ జడ్జి అడిగిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే కోటి మంది వీక్షించారు. వివరాల్లోకి వెళితే కారు రాంగ్ పార్కింగ్ కేసులో కోర్టుకు హాజరు కావాల్సి వచ్చిన ఓ తండ్రి తనతో పాటు తన కుమారుడు జాకబ్ ను కూడా కోర్టుకి తీసుకొచ్చాడు. ఆ చిన్నారికి ఐదేళ్లు ఉంటాయి. ఆ చిన్నారిని చూసిన ఆ జడ్జి తన వద్దకు పిలిచాడు. అనంతరం తన ఒళ్లో కూర్చోబెట్టుకుని కొన్ని మంచి మాటలు చెప్పారు. అనంతరం అతడి తండ్రికి ఏ శిక్ష విధించాలని అడిగారు. ఆ చిన్నారి ముందు ఆ జడ్జి మూడు ఆప్షన్లు ఉంచి, అతడి తండ్రికి 90 డాలర్ల జరిమానా, 30 డాలర్ల జరిమానా లేక జరిమానా లేకుండా వదిలేయడంలో ఏదో ఒకటి చెప్పమని కోరారు.
దీంతో ఆ చిన్నారి తన తండ్రికి ఏ జరిమానా విధించవద్దని మాత్రం అనలేదు. అలాగని 90 డాలర్ల జరిమానా వేయాలని కూడా అనలేదు. కింది ఆప్షన్, పై ఆప్షన్ కాకుండా మధ్యలో ఉన్న 30 డాలర్ల జరిమానా విధించమని చెప్పాడు. దీంతో నువ్వు మంచి జడ్జివి అంటూ ఆ జడ్జి ఆ చిన్నారిని అభినందించారు. అమెరికాలోని రోడ్ ఐలండ్‌లో గల ప్రొవిన్షియల్ మునిసిపల్ కోర్టులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఈ దృశ్యాలు ఓ న్యూస్ ఛానెల్‌లోనూ వచ్చాయి. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోని కేవలం ఒక్కరోజులోనూ కోటి మంది చూశారు... మీరూ చూడండి...