: మహేశ్ బాబు ‘స్పైడర్’ టీజర్ విడుదల రేపటికి వాయిదా
టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన మహేశ్ బాబు.. మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న ‘స్పైడర్’ మూవీ టీజర్ విడుదల వాయిదా పడింది. ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా టీజర్‌ను విడుదల చేస్తామని మహేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న దర్శకుడు, నటుడు దాసరి నారాయణరావు మృతి చెందడంతో చిత్ర పరిశ్రమ శోకంలో మునిగిపోయింది. దీంతో ఈ రోజు కృష్ణ తన పుట్టిన రోజు వేడుకను కూడా జరుపుకోలేదు. ఈ క్రమంలో స్పైడర్ సినిమా టీజర్ కూడా రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10.30 గంటలకు ఈ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు ఆ సినిమా యూనిట్ తెలిపింది.