: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి.. వాటిని చంపేవారికి జీవితఖైదు విధించాలి: రాజస్థాన్ హైకోర్టు
గోవధ నిషేధంపై ఓ చట్టం తీసుకురావాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ.. ఆవు సహా పలు పశువుల అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ ఇటీవలే ఓ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిబంధనల ప్రకారం పశువులను అమ్మే వ్యక్తులు కేవలం వ్యవసాయ పనుల నిమిత్తమే అమ్మడానికి తీసుకొచ్చామని ముందు లిఖిత పూర్వకంగా రాసివ్వాల్సి ఉంటుంది.
అయితే, కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి పలు రాష్ట్రాలు ఈ నిర్ణయంపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, వాటిని చంపేవారికి జీవితఖైదు శిక్ష విధించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. మరోవైపు ఇటీవల మద్రాసు హైకోర్టు కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షలపై నాలుగు వారాల స్టే విధించడం గమనార్హం.