: దాసరితో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది.. మాకు బంధువు కూడా: పవన్ కల్యాణ్
దర్శకరత్న దాసరి నారాయణరావు భౌతికకాయానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. దాసరి నివాసానికి వెళ్లిన ఆయన... దాసరి భౌతికకాయం వద్ద పూలమాల ఉంచి నమస్కరించారు. ఆయనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, దాసరి మృతి తనను ఎంతో కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నప్పుడు వెళ్లి కలిశానని... ఆయన త్వరగా కోలుకుంటారని ఆశించానని చెప్పారు. తన చిన్నతనం నుంచి దాసరి తనకు బాగా పరిచయమని... బంధువు కూడా అని తెలిపారు. దాసరి కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.