: దాసరికి సినీ పరిశ్రమలో తొలిరోజే మేకప్ మేన్ నుంచి ఎదురైన ఈసడింపు!


సినీ పరిశ్రమలో రాణించాలని కలలు కనని యువకుడుండడంటే అతిశయోక్తి కాదు. అయితే దాసరి అందుకు భిన్నం... డిగ్రీలో ఉండగా నాటకాలపై ఆసక్తి పెరిగింది. అది పూర్తైన తరువాత హైదరాబాదులోని బాలానగర్ లో ఉద్యోగానికి కుదిరాడు. నాంపల్లిలో స్నేహితులతో పాటు ఉంటూ పాలకొల్లులోని స్నేహితులతో కలిసి స్థాపించిన  ‘శ్రీ క్షీరారామ ఆర్ట్‌ థియేటర్‌’ తరపున హైదరాబాదులో కూడా నాటకం వేసేవారు. రవీంద్రభారతిలో నెలకు కనీసం ఒక నాటకమైనా ఆడేవారు. ఈ క్రమంలో 1965లో రవీంద్రభారతిలో నాటకం వేస్తుంటే వై.వి.కృష్ణయ్య అనే నిర్మాత చూశారు. నాటకంలో దాసరి నటన నచ్చడంతో ఆయన నేరుగా గ్రీన్‌ రూమ్‌ కొచ్చి ‘హృషీకేశ్‌ పిక్చర్స్‌’ బ్యానర్‌ మీద మేం ‘అందం కోసం పందెం’ అనే సినిమా తీస్తున్నాం. అందులో చేస్తావా?' అని అడిగడంతో,  పత్రికల్లో మద్రాసు సినీ కష్టాల గురించి చదివి తెలుసుకున్న దాసరి తటపటాయించారు. 

అంతే కాకుండా, నాటక రంగంలో పేరున్న రచయిత, దర్శకుడు, నటుడు.. మరోపక్క ఉద్యోగం.. ఇన్ని పనులు ఉండడంతో హాయిగా ఉంటున్న తాను అక్కడికి వెళ్లి ఇబ్బందులపాలు కావడం అవసరమా? అని ఆలోచించి నిర్మొహమాటంగా వద్దనేశారు. అప్పుడెళ్లిపోయిన కృష్ణయ్య గారు, కొన్నాళ్లకు మద్రాసు నుంచి దాసరికి ఒక ఉత్తరం రాశారు. అందులో తన సినిమాలో ప్రధాన హాస్యనటుడి వేషం ఇస్తానని, మద్రాస్‌ రమ్మని పిలిచారు. దీనిని చూసిన స్నేహితులు 'నీకన్నీ ఇలా కలిసి వస్తుంటాయి...మంచి అవకాశం వదులుకోకు, అన్నీ సర్దుకుని బయల్దేరు' అన్నారు. దీంతో ఆయన కూడా సరే అని బయల్దేరారు.

తొలి రోజు షూటింగ్ కు వెళ్లారు. అక్కడ కృష్ణ అనే మేకప్‌ మేన్‌ దాసరిని చూసి ‘ప్రతివాడూ ఒక నాటకం వేసేయడం, ఒక కప్పు తెచ్చుకోవడం, కప్పొచ్చిన వెంటనే మద్రాసు సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ లో దిగిపోవడం, సినిమాల్లో వేషం వేసేయాలనుకోవడం.. అసలెప్పుడైనా నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా?’ అని దారుణంగా ఈసడించాడు. అతను మరీ అంతమాట అనేసరికి షాక్ తినడం దాసరి వంతైంది. దీంతో తనలో ఉక్రోషం తన్నుకొచ్చిందని ఆయన ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. అవకాశం ఇవ్వండి అని బతిమాలితే వచ్చిన అవకాశం కాదు. వాళ్లంతట వాళ్లే అడిగితే వెళ్తే... ఇదేంటి ఇలా అంటున్నాడు? అని బాధపడుతుండగానే అతను మేకప్ పూర్తి చేశాడు. ఆఖర్న పిలక జుట్టు విగ్గు తెచ్చి తన తలపై బోర్లించడంతో మరోసారి దాసరి షాక్ తిన్నారు.

‘అదేంటీ! నన్ను ప్రధాన హాస్యనటుడి వేషానికి కదా తీసుకున్నారు?’ అని అడగడంతో... ‘భలేవాడివయ్యా అది బాలకృష్ణ (నాటి హాస్యనటుడు) గారికి ఇచ్చేశారు. ఆల్రెడీ షూటింగ్‌ కూడా చేసేశారు. నీది ఆయన అసిస్టెంట్‌ వేషం’ అని మళ్లీ మేకప్‌ మ్యాన్‌ సమాధానం ఇచ్చాడు. దీంతో వెంటనే వెళ్లి ప్రొడ్యూసర్‌ ను అడిగేశారు. అయితే ఆయన కూల్ గా ఈ మార్పు తనకు తెలియకుండా జరిగిందని, ఆయన పేరున్న ఆర్టిస్టు కావడంతో మార్చడం ఇబ్బంది అని, ఈ సారికి ఈ వేషంతో సర్దుకొమ్మని సూచించారు. ఇంతలో అక్కడున్న జూనియర్‌ ఆర్టిస్టులు ‘ఏం, అసిస్టెంట్‌ వేషం అయితే చెయ్యవా, డైలాగులున్నాయి, పద్యాలున్నాయి.. ఇదే మాకిస్తేనా’ అంటూ కామెంట్ చేశారు. నాటకరంగంలో గోల్డ్‌ మెడలిస్ట్‌ ని, రాష్ట్రస్థాయి ఉత్తమనటుణ్ని. నాకు ఈ వేషమేంటీ అన్న తన ఫీలింగ్ ను చంపేసుకుని, సెట్ లోకి వెళ్లి ఆ సీన్ లో నటించారు. ఇది దాసరి నారాయణరావు సినిమాల్లో చవిచూసిన తొలిరోజు అనుభం.

  • Loading...

More Telugu News