: వివాదాస్పద ఇస్లాం మతబోధకుడు జకీర్ సరికొత్త వ్యూహం.. మలేసియా పౌరసత్వానికి దరఖాస్తు!
జాతీయ దర్యాప్తు సంస్థ నుంచి తప్పించుకు తిరుగుతున్న వివాదాస్పద ఇస్లాం మతబోధకుడు తన వ్యూహం మార్చాడు. అతడిపై రెడ్ కార్నర్ నోటీసుకు ఎన్ఐఏ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించడంతో జకీర్ దేశాలు మారుస్తూ వస్తున్నాడు. మలేసియాలో పూర్తి స్థాయిలో స్థిరపడాలని భావిస్తున్న జకీర్ ఆ దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అతడి ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు భారత్ చర్యలు చేపట్టింది. అతడికి ఏ దేశం కూడా పౌరసత్వం ఇవ్వకుండా ప్రయత్నాలు ప్రారంభించింది.
జకీర్‌పై ఉగ్రవాద ఆరోపణలు ఉన్న విషయం మలేసియాకు తెలుసు కాబట్టి ఆ దేశం అతడి అభ్యర్థనను తిరస్కరిస్తుందని ఓ అధికారి తెలిపారు. ఉగ్రవాదం, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించగానే దేశం వదిలిపారిపోయాడు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడన్న విషయంలో స్పష్టత లేకపోయినా అరబ్, సౌదీ అరేబియా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల మధ్య చక్కర్లు కొడుతున్నట్టు తెలుస్తోంది.