: జబర్దస్త్, పటాస్ నిర్మాతలు, డైరెక్టర్లకు హెచ్ఆర్సీ నోటీసులు
తెలుగు టీవీ తెరపై పాప్యులర్ అయిన కామెడీ కార్యక్రమాలు జబర్దస్త్, పటాస్ నిర్మాతలకు, దర్శకులకు మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ షోల్లో అసభ్యత పెరిగిందని హైదరాబాద్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్లో సెన్సార్ బోర్డు సభ్యుడు ఎన్.దివాకర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని, సదరు షోలపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, దివాకర్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ, నోటీసులు జారీ చేస్తూ, ఆగస్టు 10 లోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా, ఈ కార్యక్రమాల్లో కామెడీని పరాకాష్ఠకు తీసుకెళ్లేందుకు ద్వంద్వార్థాలు, అసభ్య పదాలను వాడుతున్నారన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.