: రజనీకాంత్ వాడిన కారు కావాలన్న ఆనంద్ మహీంద్రా.. షూటింగ్ అయిపోగానే ఇస్తామని మాటిచ్చిన ధనుష్!


మహీంద్రా  గ్రూప్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన సంస్థకు చెందిన కారు కావాలని కోరుకున్నారు. ఆ కారును ఇవ్వమని కోలీవుడ్ యువ నటుడు ధనుష్ ను అడిగారు. అదేంటి? ఆనంద్ మహీంద్రా తన సంస్థకు చెందిన కారును ధనుష్ ను అడగడమేంటి? అన్న అనుమానం వచ్చిందా? అయితే ఆయన కోరింది... ఆయన సంస్థకు చెందిన కారే కానీ... రజనీకాంత్ వాడుతున్న కారు. ధనుష్ నిర్మాతగా పా.రంజిత్ రూపొందిస్తున్న ‘కాలా’ సినిమా పోస్టర్‌ ను చూశారా? ఆ పోస్టర్ లో రజనీ మహీంద్రా సంస్థకు చెందిన 'థార్‌' జీపుపై స్టైల్‌ గా కూర్చొని ఠీవీ ఒలకబోస్తూ ఉంటారు.

రజనీ స్టైల్ ను చూసిన ఆనంద్‌ మహీంద్రా... ఈ పోస్టర్ కు ఫిదా అయిపోయారు. వెంటనే రజనీ కూర్చున్న థార్‌ వాహనాన్ని తమ కంపెనీ మ్యూజియంలో పెట్టుకునేందుకు ఇవ్వాలని చిత్ర బృందాన్ని కోరారు. ఈ సందర్భంగా ‘సూపర్‌ స్టార్‌ రజనీ లాంటి లెజెండ్‌ ఓ కారుని సింహాసనంలా వాడుకుంటే.. కారు కూడా లెజెండ్‌ అయిపోతుంది’ అని ట్వీట్‌ చేశారు. దీనిపై రజనీ అల్లుడు, నటుడు ధనుష్‌ స్పందిస్తూ ‘చాలా థ్యాంక్స్‌ సర్‌. ప్రస్తుతం కారుని చిత్రీకరణ కోసం వాడుతున్నాం. షూటింగ్ అయిపోగానే మీకు పంపే ఏర్పాట్లు చేస్తాం’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్లు అభిమానులను అలరిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. మాఫియా డాన్ కథతో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.











  • Loading...

More Telugu News