: దూకుడుగా ఆడితే 'బ్యాక్ టూ పెవీలియనే': హెచ్చరించిన కేదార్ జాదవ్
న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో స్థానం లభించకపోయినా, ఇంగ్లండ్ లోని పిచ్ లను పరిశీలించే పనిని తన భుజాలపై వేసుకున్న బ్యాట్స్ మెన్ కేదార్ జాదవ్ ఆటగాళ్లకు కీలక సలహా ఇచ్చాడు. ఈ పిచ్ లపై పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నాయని, పచ్చిక బాగా కనిపిస్తుండటంతో, బంతి స్వింగ్ అవడం ఎక్కువగా కనిపిస్తోందని అన్నాడు. దూకుడుగా ఆడితే త్వరగా అవుట్ అయ్యే ప్రమాదం అధికమని, టెస్టు మ్యాచ్ లో లేదా రంజీ మ్యాచ్ లో ఆడినట్టు నిదానంగా ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. మంచి బంతి వస్తే దాన్ని గౌరవంగా వదిలివేయడమే మేలని సలహా ఇచ్చాడు. మొత్తం మీద ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడితేనే ఫలితం అనుకూలంగా ఉంటుందని, తన తొలి ఛాంపియన్స్ ట్రోఫీ ఇదే కాబట్టి, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. ప్రస్తుతం ఈ వాతావరణానికి అలవాటు పడేందుకు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నట్టు వెల్లడించాడు.