: ఇండియానే గెలుస్తుందన్న చాచా షికాగో... జీర్ణించుకోలేకపోతున్న పాక్ ఫ్యాన్స్
మొహమ్మద్ బషీర్ అలియాస్ చాచా షికాగో... ఇతనెవరో తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. పాక్ తో ఇండియా తలపడే ప్రతి మ్యాచ్ లో ఇతను స్టాండ్స్ లో కనిపిస్తాడు. పాక్ జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ ఇతను చేసే సందడి అంతా ఇంతా కాదు. దాయాదుల మధ్య జరిగే ఉత్కంఠభరిత పోరులో తమ ఆటగాళ్లను ఉత్తేజపరుస్తూ హంగామా చేస్తుంటాడు. తెల్లగడ్డంతో చిరునవ్వులు చిందిస్తూ ఉండే చాచా షికాగోకు పాకిస్థాన్ లో చాలా మంది అభిమానులు ఉన్నారు.
తాజాగా మొహమ్మద్ బషీర్ చేసిన వ్యాఖ్యలు పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో జూన్ 4న ఇండియా-పాక్ ల మధ్య జరిగే మ్యాచ్ లో 'వార్ వన్ సైడే' అని ఆయన అన్నాడు. ధోనీ, కోహ్లీ, యువరాజ్ లాంటి దిగ్గజాలు ఉన్న టీమిండియాను ఓడించే సత్తా పాకిస్థాన్ కు లేదని స్పష్టం చేశాడు. పాక్ జట్టు క్రమంగా బలహీనపడిందని... ఇదే సమయంలో భారత్ బలపడిందని చెప్పాడు. ఇంతకు ముందులా భారత్-పాక్ మ్యాచ్ లు ఇప్పుడు అంత మజా ఇవ్వడం లేదని అన్నాడు. ఇండియాను ఢీకొట్టే సత్తా తమ ఆటగాళ్లకు లేదని చెప్పాడు. కరాచీకి చెందిన మొహమ్మద్ బషీర్ అమెరికాలోని షికాగోలో రెస్టారెంట్ యజమానిగా స్థిరపడ్డాడు.