: సోషల్ మీడియాలో హనీ ట్రాప్.. యువకుడి కిడ్నాప్.. పోలీసులు రంగంలోకి దిగడంతో కిడ్నాపర్ ఆత్మహత్య
సోషల్ మీడియా ద్వారా అమ్మాయినని నమ్మించి తన కజిన్‌నే ట్రాప్ చేసి, కిడ్నాప్ చేసి రూ.25 లక్షలు డిమాండ్ చేసిన యువకుడు.. పోలీసుల రంగ ప్రవేశంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అక్షయ్ అనే యువకుడు ఫేస్బుక్లో శ్రేయ త్యాగి పేరుతో ఖాతా తెరిచి చాలామందిని స్నేహితులుగా యాడ్ చేసుకున్నాడు. శ్రేయ ప్రొఫైల్ నిజమైనదేనని నమ్మించేందుకు చాలా రకాలుగా ప్రయత్నించాడు. అందుకోసం పలు ఫొటోలు పోస్ట్ చేశాడు. ఓ రోజు తన కజిన్ యాష్ సారస్వత్ ఇంటికి వెళ్లిన అక్షయ్ తన ఫోన్‌ను అతడికి ఇచ్చి పట్టుకోమని చెప్పాడు. ఆ మొబైల్‌పై శ్రేయ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుండడంతో సారస్వత్ ఆరా తీశాడు.
దీనిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించిన అక్షయ్.. శ్రేయకు తానంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. అనంతరం అతడి ఫోన్‌ను దొంగలించిన అక్షయ్ అతడి ఫేస్బుక్ ఖాతాకు శ్రేయ ఫేస్బుక్ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి అనంతరం దానిని యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. శ్రేయ పేరుతో అతడితో రాత్రంతా చాట్ చేస్తూ గడిపేవాడు. ఆ తర్వాత వారి చాటింగ్ వాట్సాప్‌కూ మారింది. ఓ రోజు శ్రేయ(అక్షయ్) అతడికి ఫోన్ చేసి ఢిల్లీలోని భజన్‌పురాలో కలుసుకుందామని, రావాలని ఆహ్వానించింది. శ్రేయ (అక్షయ్)ను కలుసుకునేందుకు పూలు, గిఫ్ట్ పట్టుకుని వచ్చిన సారస్వత్‌ను స్నేహితులతో కలిసి అక్షయ్ అద్దెకు తీసుకున్న కారులోకి బలవంతంగా ఎక్కించి కిడ్నాప్ చేశాడు.
అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ.25 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో భయపడిన సారస్వత్ తల్లిదండ్రులు డిమాండ్ చేసిన డబ్బుతో అతడు చెప్పిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ డబ్బులు తీసుకున్న కిడ్నాపర్లు సారస్వత్‌ను కారు నుంచి కిందికి తోసేసి పరారయ్యారు. అంతా కిడ్నాపర్లు అనుకున్నట్టుగా జరిగినా అదృష్టం తిరగబడింది. విషయం తెలిసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. దీంతో తాను జైలుకు వెళ్లడం ఖాయమని అక్షయ్ భయపడ్డాడు. పోలీసులు అరెస్ట్ చేయడానికి కొన్ని గంటల ముందు స్నేహితుడి ఇంటికి చేరుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కిడ్నాప్‌తో సంబంధం ఉన్న మరో ముగ్గురు యవకులను పోలీసులు అరెస్ట్ చేశారు.